తెలుగు సంగతులు

సోమవారం, జూన్ 25, 2012

పరాయి పాలన నాడు-నేడు


                         పరాయి పాలన, నాడు-నేడు

పాలక, పాలిత వర్గాల మధ్య ఘర్షణను చిత్రీకరించిన రచనలు 20 వ శతాబ్ది తొలి అర్ధ భాగంలో చాలా వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ‘దొర’తనాన్ని కళ్ళకు గట్టే, వాటిని ఎదుర్కోవడంలో సామాన్యుల తెగింపు గురించిన  రచనలు, అదే సమయంలో నిజాం నిరంకుశ పాలనపై వెలువడిన కధలు, గేయాలు, నవలలు వగైరా సాహిత్యం చాలానే ఉంది. ఆ సమయంలోనే – 1937-38 కాలంనాటి తెలంగాణ పరిస్థితుల్ని ఒక పల్లెటూరి నేపధ్యంలో వాస్తవాలకు దగ్గరగా చిత్రీకరించిన నవల శ్రీ దాశరధి రంగాచార్యా గారి ‘చిల్లర దేవుళ్ళు’. ఈ రచయిత--- ఎన్నో సినీ గీతాల, మాటల రచనలు చేసిన సుప్రసిద్ధ కవి శ్రీ దాశరధి కృష్ణమాచార్యులవారికి సోదరుడు, వరంగల్లు జిల్లాకు చెందిన వారు.

‘చిల్లర దేవుళ్ళు’ నవల ఆసాంతం అప్పటి తెలంగాణ పల్లెలలో జరుగుతున్న దారుణమైన దోపిడీని, కుల/వర్ణ వ్యవస్థని అద్దం పట్టినట్టు చిత్రీకరించడం జరిగింది. తెలంగాణ మాండలీకంతో బాటు, అప్పటి నిజాం పాలనా ప్రభావం వల్ల తెలుగులో, తెలంగాణంలో జొరబడిన ‘ఉర్దూ’ వాడుకను యధాతధంగా ఆయా పాత్రలతో పలికించారు. ఉర్దూ పదాలకు మాత్రం కింది ఫుట్ నోట్స్ లో అర్ధాలు ఇచ్చారు. అక్కడక్కడా కధనంలో తెలంగాణా మాండలీకం ఇతర ప్రాంత పాఠకులకు కొంచెం అడ్డు తగిలినట్టనిపించినా, కధాగమనంలోని నిజాయితీ వల్ల, వాస్తవ చిత్రీకరణ వల్ల కొంతసేపటికి పూర్తిగా కధలోని జీవితాలలోకి ప్రవేశించేస్తాము. ఇక భాష అడ్డు రాదు.
అప్పటి తెలంగాణాలోని పరిస్థితులపై, ముఖ్యంగా--- కుల వ్యవస్థపై, వెట్టి చాకిరిపై, దొరతనపు దౌర్జన్యాలపై, స్త్రీల అణచివేతపై, గ్రామపెద్దల (పటేల్ పట్వారీ వ్యవస్థ) కుయుక్తులు—భూఆక్రమణలపై, నిజాం నిరంకుశత్వంపై, బలవంతపు మతమార్పిళ్ళపై ఎక్కుపెట్టిన అస్త్రం దాశరధి రంగాచార్య గారి ‘చిల్లర దేవుళ్ళు’.  అంతేకాకుండా తెలంగాణాలోని అప్పటి ఆర్ధిక, సామాజిక స్థితిగతులతో బాటు ఆనాటి రాజకీయ వ్యవస్థని కూడా మనకు కళ్ళకు కట్టింది ఈ నవల. నవలాప్రక్రియలో భాగంగానే పాత్రలు కల్పితాలే అయినా, వాటి స్వభావం వాస్తవానికి దగ్గరగా ఉండడం, అప్పటి యదార్ధ రాజకీయ సంఘటనల్ని, వ్యక్తుల్ని పాత్రలుగా చేర్చడం ద్వారా ‘చిల్లర దేవుళ్ళు’ చారిత్రక నవల స్థాయిని పొందింది.
అయినప్పటికీ నవల సౌందర్యం కోసమో, లేదా రచనా సరళి అదేనేమో గాని, సాధారణ నవలల్లో కనిపించే వర్ణనలు, ముఖ్యంగా నాయకీ నాయకుల ప్రేమ వ్యవహారాల్లో ఊహల్లో తేలడాలు, నాయకుని పట్ల చాలామంది యువతులు ఆకర్షితులవ్వడం, తీరా అతని నుంచి సానుకూల స్పందన కనిపించకపోయేసరికి – ఆకస్మాత్తుగా సోదర ప్రేమగా పరిణతి చెందిపోవడం వగైరా విషయ చిత్రీకరణలో సాధారణ నవలా ప్రక్రియ చట్రాన్ని అధిగమించలేకపోయారు రచయిత. ముఖ్యంగా కధాంతంలో – అప్పటి వరకూ ‘పంతులు’ గా వున్న పాణి (నాయకుడు), రెడ్డి గారి పుత్రిక ‘మంజరి’ని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి — కధలో గొప్ప మలుపు తిప్పేసి, నాటకీయ లేదా సినిమా ఫక్కీలో నాయకుడు చిన్నప్పుడు తప్పిపోయిన బావ వరుసవాడేనని ముఖ్యంగా ‘రెడ్డే’ నని తేల్చి వర్ణ సంకరం జరక్కుండా జాగ్రత్త పడిపోయినట్టు అనిపిస్తుంది రచయిత ఊహ. లేదా వర్ణాంతర వివాహం అప్పట్లో అసాధ్యం అనుకొని ఎందుకు ఎదురీత అని సరిపెట్టారో తెలియదు గాని, నవలలోని అభ్యుదయ భావాలకు ఇది కొంత అవరోధంగా కనబడుతుంది. మొత్తం మీద కధనం అంతా ‘గడీ’ (కోట లాంటి దొరల నివాసం)లోనూ, వారి వాకిళ్ళ లోనూ అధిక భాగం జరగడం వల్ల, పీడిత జనాల గుడిసెల్లోకి అంతగా చూసినట్లు కనపడదు. కానీ ముఖ్య పాత్రధారి ‘పాణి’ అప్పటి చారిత్రిక పురుషులు మాడపాటి హనుమంతరావు వంటి స్వాతంత్ర సమర యోధులతో చర్చలు జరపడం, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు, ఆంధ్రమహా సభల నిర్వహణ మొదలైన విషయాల్ని ప్రస్తావించడం ద్వారా నవలకు చారిత్రిక లక్షణం అబ్బింది. ‘మెలోడ్రామా’ కి సంబంధించిన కొద్దిపాటి ఘటనలూ మినహా, మొత్తం మీద ‘చిల్లర దేవుళ్ళు’ చదవదగ్గ పుస్తకం.  స్వాతంత్రానికి పూర్వపు తెలంగాణ ముఖ చిత్రాన్ని అతి దగ్గరగా చూసే అవకాశం పాఠకులకు దొరుకుతుంది. అప్పటికీ, ఇప్పటికీ ఆలోచింపచేసే, మేలుకొలిపే ఉన్నత రచన ‘చిల్లర దేవుళ్ళు’. సాహిత్య అకాడమి అవార్డు, హిందీ, ఇంగ్లిషు భాషల్లోకి అనువాదంగా వెళ్లడం, ఆకాశవాణిలో రేడియో నాటకంగా ప్రసారం, దరిమిలా సినిమాగా నిర్మించడం – ఈ నవలకు అవార్డులు, రివార్డులుగా పరిగణించవచ్చు. అనేక పునర్ముద్రణలకు నోచుకున్న పుస్తకం. విశాలాంధ్ర ప్రచురణ.
ఇంతటితో ఈ సమీక్ష అయిపొయింది కానీ, కాకతాళీయంగా వెనువెంటనే చదివిన మరో పుస్తకం గురించిన వ్యాఖ్య కూడా జమిలిగా ఇక్కడే వ్రాస్తే సరిగా ఉంటుందని భావించాను. ‘చిల్లర దేవుళ్ళు’ రచనా కాలం నాటి నుండి-- ఆరు దశాబ్దాల తరువాత కధల రూపంలో వచ్చిన ‘న్యూ బాంబే టైలర్స్’ మహమ్మద్ ఖదీర్ బాబు కలం నుండి ఒలికిన జీవిత చిత్రాలు. 
 ఈ రెండు పుస్తకాలకు పొంతన లేకపోయినా ఏదో తెలియని లింకు ఉందనిపించే వైచిత్రి. అప్పటి నిజాం పాలనలో నిరంకుశంగా జరిగిన మత మార్పిళ్ళు గురించి విడమర్చిన ఉన్నతవర్గానికి చెందిన రచయిత రంగాచార్య గారయితే, అరవయ్యేళ్ళ తరువాత ముస్లిముల దీనావస్థను వ్యధాభరితంగా చిత్రించిన నేటి మైనారిటీ వర్గానికి చెందిన రచయిత ఖదీర్ బాబు. ఈ రెంటిలోనూ ఉన్న సారూప్యాలు వాస్తవ జీవిత చిత్రీకరణ, అణచివేత.  అయితే అణచివేత విషయంలో వర్గాలు మారినా, పాలక – పీడిత చరిత్ర మెజారిటీ, మైనారిటీ లకు అతీతమయినదని గ్రహించాలి. ‘చిల్లర దేవుళ్ళు’ తెలంగాణ (వరంగల్లు) నేపధ్యం లోనిదయితే, ‘న్యూ బాంబే టైలర్స్’ చిన్న పట్టణం లోని చిన్న మధ్య తరగతి జనుల మధ్య నడుస్తాయి. కావలి పట్టణం దానికి నేపధ్యం.
స్వాతంత్రానికి పూర్వం తెల్ల దొరల దౌష్ట్యం, అంతకు మించి గ్రామాల్లో దొరల, భూస్వాముల దౌర్జన్యాలు ‘చిల్లర దేవుళ్ళు’ కళ్ళకు గడితే, స్వాతంత్రానంతరం నల్ల దొరల దాష్టీకం, మత విద్వేషాలు, పరోక్షంగా పరాయి శక్తుల పాలన, గ్రామాల్లో చేతివృత్తుల, చిన్నకారు బతుకుల ఛిద్ర పటాన్ని’న్యూ బాంబే టైలర్స్’ ఆవిష్కరించింది. 
ఖదీర్ బాబు కధావిధానం, అతిశయోక్తులు లేని సరళత, గుండెల్ని తాకే మధ్య చిన్న తరగతి బతుకుల చిత్రీకరణ ఆయన అన్ని రచనల్లో లాగానే సహజంగా ఉన్నాయి. ‘గుడ్డలంటే కొలతలు బట్టి కుట్టడం కాదు, మనిషిని బట్టి కుట్టడం’ అనే పీరుభాయికి, పోరడు, వాళ్ళ నాయన, తాత కూడ ఒకే చొక్కాలో దూరగలిగే ‘లూజు’ ఫిట్టింగు రెడీమేడ్ గుత్తందారీ కుట్ర బాగానే అవగాహనకు  వచ్చింది. నైపుణ్యం, పని కౌశల్యం  స్థానం లో కేవలం లాభం, పెట్టుబడి చొరబడ్డాయని, అవి సామ్రాజ్యవాదులు, పెద్ద పెట్టుబడిదారీ వ్యవస్థల కబంధ హస్తాల్లోనే ఉన్నాయని, స్వతంత్రం, ప్రజాస్వామ్యం బూటకం గానే మిగిలిపోతున్నాయని, గౌరవమయిన కులవృత్తులు చేసుకొనేవారు రోజువారీ కూలీలుగా బతుకు బానిసలుగా మారిపోవలసి వచ్చిందని పీరూభాయికి బోధపడినా పౌరుషం చంపుకోలేక తన పాత టైలరు దుకాణానికే రంగులేసి మళ్ళి తెరవడం అతని వ్యక్తిత్వాన్ని చాటి చెబుతాయి. అదే దోవలో, ‘పెండెం సోడా సెంటరు’ కధ కూడ నడుస్తుంది. విదేశీ పానీయాల ధాటికి, వాటి రంగు రంగుల వ్యాపార ప్రకటనల జోరుకి ఆరోగ్యమయినవి, చౌకయినవి అయిన మన పానీయాలు, సోడాలు వెల వెల పోతూంటే--పెండెం చంద్రయ్య ముందు నీరు కారిపోయినా, స్వాతంత్ర పోరాటం నాటి స్ఫూర్తి అతనిని, అతని మనో ధైర్యాన్ని దెబ్బ తీయలేకపోయాయి. అందుకు మూల్యంగా తన తరువాతి తరం (కొడుకు) కూడా బలి అయిన సంగతి మనసుల్ని కలచివేస్తుంది. మిగతా కధలలో ఎక్కువ ముస్లిముల వ్యధలు కనబడతాయి. మూఢసంప్రదాయాలు, ఆర్భాటాలు మధ్యతరగతి బతుకుల్ని అప్పుల ఊబిలోకి ఎలా దించి, కుదించి, కృశింప చేస్తాయో విశదమవుతుంది.
ఇన్నీ చదివాక ఖచ్చితంగా అనిపించే, అగుపించే విషయం — అవును, మనం నిజంగా పరాయి పాలననుండి విముక్తి పొందామా? లేదా నల్లదొరల మధ్యవర్తిత్వంతో, దళారి తనంతో ఇప్పటికీ అస్వతంత్రులుగానే ఉన్నామా? అనిపిస్తుంది. నిజమే మరి! మనం కట్టిన పన్నులతో భారీగా దశాబ్దాల పాటు చేసిన పరిశోధన, పరిశ్రమ అంతా విదేశీ పెట్టుబడుల పేరుతో ప్రయివేటుపరం కావడం తరువాతి పరిణామంగా మన సహజ వనరులే మనకి గాని, మనం ఎన్నుకున్నామనుకుంటున్న, కుంటుతూన్న ఈ ప్రభత్వం అజమాయిషీలో లేకపోవడం ఇప్పటి చేదు నిజం. ఉదాహరణగా – ఒ ఎన్ జి సి వేల కోట్ల ఖర్చుతో చేసిన పరిశోధన, సహజ వాయు నిక్షేపాల గుర్తింపు – ఒక్క సారిగా రిలయన్సు లాంటి వడ్డీ వ్యాపారస్తుల చేతికి అప్పచెప్పి సహజ వాయువు లభ్యత ఎంతో కూడా తెలుసుకోలేని దీనావస్థ మన ప్రభుతది. కొనసాగింపుగా ఆ బావుల్లో 26 శాతం వాటాను ‘బ్రిటీషు పెట్రోలియం’ సంస్థకు రిలయన్సు లాభాలకు అమ్ముకోవడం—దేనికీ సూచన. మనం ఎవరి అదుపులో, ఆధిపత్యంలో ఉన్నాం.